Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, July 25, 2013

ఎఫెసీయులకు 1వ అధ్యాయము

1  దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి (శుభమని చెప్పి) వ్రాయునది 
2  మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. 
3  మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడు గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. 
 4-6. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తనకోసరము నిర్ణయించుకొని, మనము తనయెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 
7  దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధమలకు క్షమాపణ మనకు కలిగియున్నది. 
  8-9. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను. 
10  ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని భూమిమీద ఉన్నవేగాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను. 
  11-12. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. 2ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. 
13  మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానముచేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. 
14  దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. 
15  ఈ హేతువుచేత ప్రభువైన యేసునందు మీరుంచుకొనిన విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమునుగూర్చియు నేను వినినప్పటినుండి 
16  మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
 17-19. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మాహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపనచేయుచున్నాను. 
20-21. ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతినామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని యున్నాడు. 
22  మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించెను. 
23  (ఆ సంఘము) ఆయన శరీరము; అది సమస్తమైనవాటిలో ఉండి సమస్తమైనవాటిని నింపుచున్న వానితో నింపబడినదై యున్నది. 
     Download Audio File

No comments:

Post a Comment